ద్వాపర యుగంలో కాలయవనుడు అనే రాక్షసుడు తాపసులను, అమాయక ప్రజలను తీవ్రంగా హింసిస్తుంటాడు. రాక్షసుడి హింసను బరించలేక ప్రజలు శ్రీకృష్ణపరమాత్ముడిని ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై కాలయవనుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో రాక్షసుడిని చంపడానికి శ్రీకృష్ణుడు ఎన్నో ఆయుధాలు ఉపయోగిస్తాడు. అయినా రాక్షసుడు ఎంతకీ మరణించకపోవడంతో శ్రీకృష్ణుడు దివ్యదృష్టితో చూస్తాడు. అప్పుడు ఒక మహర్షి చేతిలోనే రాక్షసుడికి మరణం ఉందని తెలుసుకుని.. ఆ రాక్షసుడిని వెలుగొండ వరకూ తరుముకుంటూ వచ్చి అంతర్థానమవుతాడు. ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి శ్రీమన్నారాయణుడి గురించి ముచికుంద మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేస్తున్న మునిని చూసిన రాక్షసుడు శ్రీకృష్ణుడే అని భ్రమించి.. మహర్షి తపస్సుకు భంగం కలిగిస్తాడు. దీనికి ఆగ్రహించిన ముని ఆ రాక్షసుడిని తన తపశ్శక్తితో అంతం చేస్తాడు. తర్వాత ఆ ముని ఇదంతా దైవలీల అని తెలుసుకుంటాడు. రాక్షసుడి అంతం తర్వాత శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడి రూపంలో మహర్షికి దర్శనం ఇస్తాడు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు ఏదైనా కోరుకోమని అడగగా.. ఇక్కడే ఉండాలని ముని ప్రార్థిస్తాడు. అప్పుడు మహర్షి కోరిక మేరకు శ్రీమహావిష్ణువు స్వరూపంలో వెలుస్తాడు. రాక్షసుడి అంతానికి ప్రతీకగా స్వామి వారికి పెద్దలు కోర మీసాలు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి శ్రీవెలుగొండ వేంకటేశ్వరస్వామిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. తిరుమలలోని వేంకటేశ్వరస్వామి వారికి వెలుగొండ వేంకటేశ్వరుడు ప్రతిరూపమని భక్తుల నమ్మకం. తిరుమల వేంకటేశ్వరుని ఆలయం వరకూ వెళ్ళి దర్శించుకోలేని భక్తులు వెలుగొండ వేంకటేశ్వరుణ్ణి చూసినా చాలనుకొంటారు.
విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక రాజ్యాన్ని జయించి తిరిగి వెళ్తూ వెలుగొండలో విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు ఆయన కలలో భగవానుడు కనిపించి.. తనకు ఆలయాన్ని నిర్మించాలని కోరారని, దీంతో రాయలవారు వెలుగొండలో ఆలయాన్ని నిర్మింపచేసినట్టు ఆలయ ఆవరణలో రాతి శాసనం ఉంది. ఈ రాతి శాసనం గరుత్మంతుడి వద్ద దేవనాగరి లిపిలో ఉంటుంది.
కొండ గుహలో స్వామి ఉండటానికి కారణం..
వెలుగొండలోని కొండల నుంచి తిరుమలలో ఉన్నటువంటి కొండల వరకూ వెలుగొండ అనే పిలుస్తారు. వెలుగొండలో ఆదిశేషువు పడుకుని ఉంటాడు. తిరుమలలో ఆదిశేషువు ఏడు శిరస్సులు, ఏడు కొండలు కలిగి ఉంటాడు. శిరస్సు భాగంలో తిరుమల వేంకటేశ్వరుడు ఉంటే, తోక భాగంలో శ్రీవెలుగొండ వేంకటేశ్వరస్వామి ఉంటాడు. అందుకే శ్రీవెలుగొండ వేంకటేశ్వర స్వామి కొండ కింద భాగంలో ఉంటారు. తిరుమల వేంకటేశ్వరుడు కొండ పైభాగంలో ఉంటారని చరిత్ర చెబుతోంది.
అమ్మవారి చరిత్ర
కొండ పైభాగంలో శ్రీలక్ష్మీదేవి ఆలయం ఉంటుంది. దీనికి కారణం.. స్వామి వారు శ్రీఅలివేలు మంగమ్మను వివాహం చేసుకోవడంతో శ్రీలక్ష్మీదేవి అలిగి ఆలయంలోని సొరంగం గుండా కొండపైకి వెళ్లిందని, అందువల్ల కొండపైన శ్రీలక్ష్మీదేవి అమ్మవారికి ఆలయ నిర్మాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.
క్షేత్రం ప్రత్యేకత
వెలుగొండలో మోక్ష ద్వారమైన ఉత్తర ద్వారమే ప్రధాన ద్వారంగా ఉంది. అన్ని ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. వెలుగొండలో మాత్రం అన్ని రోజులూ ఉత్తర ద్వారం నుంచే భక్తులకు ప్రవేశం. ఉత్తర ద్వార దర్శనం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల శ్రీవెలుగొండ స్వామిని ఏ రోజు దర్శించినా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందన్నది భక్తుల నమ్మకం.
బ్రహ్మోత్సవాలు
గార్లదిన్నె పంచాయతీలోగల వెలుగొండ క్షేత్రంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ వేంకటేశ్వర (వెలుగొండరాయ) స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఫాల్గుణమాసంలో శుద్ధ చతుర్దశి నుండి 8 రోజులు వైభవంగా నిర్వహిస్తారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణానికి కల్యాణోత్సవం, అష్టమినాడు గరుడ సేవ, నవమి నాడు గజోత్సవం, దశమినాడు రథోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనుటకు భక్తులు కొనకనమిట్ల మండలంతోపాటు, పలు ప్రాంతాలనుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చెదరు. బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారికి రథోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు విచ్చేసిన భక్తులు, కొండమీద పీఠమీద నెలకొన్న లక్ష్మమ్మ ఆలయాన్ని కూడా దర్శించుకుని పూజలుచేస్తారు.
వేంకటేశ్వరుడి పాదోబ్భవమే ముచికుంద నది...
ఆ కాలంలో వెలుగొండ సమీపంలో ముచికుంద నది ఉండేదని, అది శ్రీవేంకటేశ్వరుడి పాదాలచెంత పుట్టేదని పురాణాలు చెబుతున్నాయి. ముచికుంద మహర్షి తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి నదికి ముచికుంద అని పేరు వచ్చింది. అయితే కాలక్రమేణా వాడుక భాషలో ముసీనదిగా మారిందని భక్తుల నమ్మకం.
వైభవంగా తిరునాళ్ల
బహ్మోత్సవాల్లో భాగంగా వెలుగొండలో తిరునాళ్లు నిర్వహిస్తారు. వెలుగొండలో వివిధ కులాలకు చెందిన అన్నదాన సత్రాలున్నాయి. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు విస్తృతంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెలుగొండలో రాష్ట్ర స్థాయి కోడెల బల ప్రదర్శన నిర్వహించి గెలుపొందిన కోడెల యజమానులకు బహుమతులు అందజేస్తారు. ఈ ఉత్సవాల్లో విద్యుత్ ప్రభలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ ఉత్సవాల్లో భక్తుల కొరకు సాంస్కృతిక కార్యకలాపాలు కూడా నిర్వహిస్తారు. తిరునాళ్లు సందర్భంగా ఒంగోలు, పొదిలి, మార్కాపురం, కంభం, కనిగిరి డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది.
వెలుగొండకు మార్గం..
శ్రీలక్ష్మీ అలివేలుమంగ సమేత శ్రీవెలుగొండ వేంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గార్లదిన్నె పంచాయతీలో ఉంది. ఈ క్షేత్రం కంభం అటవీ ప్రాంతంలో కలదు. ప్రకాశం జిల్లా ముఖ్యపట్టణమైన ఒంగోలు నుంచి 85 కిలో మీటర్లు ఉంటుంది. ఆలయానికి చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి.
ఒకటో మార్గం..
566 నంబర్ జాతీయ రహదారి నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మార్కాపురం – పొదిలి దారిలో నాగిరెడ్డిపల్లె గ్రామం వస్తుంది. అక్కడి నుంచి ఆలయానికి రోడ్డు మార్గం కలదు. నాగిరెడ్డిపల్లె గ్రామం నుంచి శ్రీవెలుగొండ వేంకటేశ్వర స్వామి క్షేత్రానికి ఐదు కిలోమీటర్లు ఉంటుంది. మార్కాపురం నుంచి వెలుగొండ క్షేత్రానికి 28 కిలో మీటర్లు ఉంటుంది. కొనకనమిట్ల నుంచి 16 కిలో మీటర్లు ఉంటుంది.
రెండో మార్గం..
ఒంగోలు – కర్నూలు రహదారి నంబర్ 53 నుంచి కూడా ఈ పుణ్యక్షేత్రానికి రావొచ్చు. గొట్లగట్టు వద్ద నుంచి నాగిరెడ్డిపల్లె వెళ్లే పీఎస్‌ఆర్ మార్గం నుంచి వెలుగొండ క్షేత్రానికి చేరుకోవచ్చు. గొట్లగట్టు నుంచి 13 కిలో మీటర్లుంటుంది. కంభం నుంచి 45 కిలో మీటర్లు ఉంటుంది.
Sri Velugonda Venkateswara swamy temple 85 K.M. from Ongole. 16 km from Konakanamitla, 26 km from Markapuram, 13 km from Gotla Gattu, 45 km From cumbum,