22/12/2023
#మరేడుమిల్లి టూర్ గురించి తూ.గో.జిల్లా 😍😍
ఎక్కడో ఉన్న కేరళ అందాలు కన్నా ... ఇక్కడే ఉన్న మన గోదావరి అందాలు మిన్న అని నేను ఈ రోజు దానికి చిన్న ఉదాహరణ చెప్పేదాం అనుకుంటున్నానండి ఆయ్
మీకు కచ్చితంగా నచ్చుతాది ... అలాగే మనం కూడా ఒకసారి చూడాలి అనిపిస్తాది ఇది చదివాక కాబట్టి ఓ పాలి చదివెయ్యండి మరి ...
మాములుగా #రంపచోడవరం మరేడుమిల్లి గురించి చాలా మందికి తెలుసండి ... ఇంకా చాలా మందికి తెలియాల్సి ఉంది ... అసలు అక్కడ ప్రత్యేకత ఏంటి అన్నది ఈ రోజు చూసేద్దాం అండి
ఒక అడివి ప్రాంతం అండి అదంతా ... పచ్చని చెట్లు , ప్రశాంతమైన వాతావరణం , స్వఛ్చమైన గాలి, కనులకు కనువిందు చేసే అందాలు, ఇలా చాలా ఉన్నాయండి పర్యాటకులని భలే ఆకర్షించే ప్రాంతం అండి ఆయ్
మన #రాజమండ్రి నుండి సుమారు 80 కి.మీ దూరం లో ఉన్నాయండి ఇవి ... ఇక్కడికి వెళ్లే వాళ్ళు కార్ కట్టించుకుంటే మంచిదండి ... లేదు సొంతంగా కార్ ఉంటే డ్రైవింగ్ బాగా వచ్చినవాళ్ళు అయితే పర్లేదండి ... ఘాట్ రోడ్లు అండి అన్ని చాలా మలుపులు ఉంటాయి మళ్ళీ సరిగా డ్రైవింగ్ రానోళ్లు అయితే ఇబ్బంది పడిపోవాలి ... మనం ఉన్న చోట నుండి ఎంత దూరం అని చూసుకుంటే దాని బట్టి బయలుదేరితే చాలండి ... కాని ఉదయం 6 లేదా 7 తప్పితే 8 లోపు ఇక్కడికి చేరుకుంటే చాలా బాగుంటాదండి చూడటానికి ... ఇప్పుడు వర్షాకాలం బాగుంటాది గానండి మట్టి నేల కాబట్టి జారిపోయి పైగా లోపలికి వెళ్ళాక వర్షం వస్తున్నట్టు కూడా సరిగా తెలిదండి ... వాగులు కూడా పొంగుతాయి కాబట్టి కుంచెం రిస్క్ అండి ఇప్పుడైతే ... శీతాకాలం అయితే చూసుకోనవసరం లేదండి అదిరిపోతాది.
సముద్రమట్టానికి సుమారు సుమారు " రెండు వేల " అడుగుల ఎత్తులో ఉందండి. కాఫీతోటలు, ఎత్తైన వృక్షాల మొదళ్ళనుంచు పైదాకా ఎగబ్రాకిన మిరియాల పాదులతో చాలా మనోహరంగా ఉంటాదండి ... దీనిని ఆంధ్రా ఊటీ అని కూడా అంటారండి ...కాఫీ మరియు రుబ్బరు తోటలు బాగా ఎక్కువగా ఉంటాయండి.
ముందుగా వెళుతుంటే మనకి #రంపచోడవరం తగులుతాదండి ఇక్కడ కూడా జలపాతాలు ఉంటాయండి ఇవి సంవత్సరం పొడవునా నీటి ప్రవాహాలతో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయండి... #రంపచోడవరం కి 4 కి. మీ. దూరంలో ఉంటాదండి శ్రీ #నీలకంఠేశ్వర వన విహార స్థలం పురాతన శివాలయం కూడా ఉందండి. ఇక్కడే #అల్లూరి_సీతారామరాజు గారు ఈ ఆలయంలోనే పూజలు చేసేవారని చెబుతారు
ఆ తర్వాత #జలతరంగిణి జలపాతం అండి ... ఇక్కడ చాలా బాగుంటాదండి తెల్లారే ముందు వేకువ జామున వెళితే భలే ఉంటాదండి బాబు ... ఇంకా రెండు జలపాతాలు #స్వర్ణ_ధార, #అమృత_ధార అనేవి కూడా మారేడుమిల్లి అడవిలోనే ఉన్నాయండి ... కొండల నడుమనుంచి అడవిలో పాములా మెలికలు తిరుగుతూ గలగల శబ్ధాలతో ఉదృతంగా ప్రవహించే ఏరు, #పాములేరండి ... తూర్పు కనుమలలో ఎక్కడో పుట్టి, ప్రకృతి ప్రేమికులకు మనోల్లాసం కలిగిస్తూ, జంతు, వృక్ష జాలాలకి నీటి అవసరాల తీరుస్తూ తూర్పుగోదావరి, ఖమ్మం జిల్లాల సరిహద్దులో గోదావరిలో కలుస్తాదండి ఈ #పాములేరు వాగు.
#నందవనం ఇక్కడ బేంబూ చికెన్ మరియు ఔషధ మొక్కల తోటలకు బాగా ప్రసిద్దండి తర్వాత వాలీ సుగ్రీవ మెడిసినల్ ప్లాంట్ కన్వర్శేషన్ ఏరియా ఉంటాదండి ఇక్కడ కూసంత ఎత్తుపల్లాల కింద ఉంటాదండి ... ఇది సుమారు 260 హెక్టార్ లలో విస్తరించి ఉందండి ఈ ఏరియాలో 250 పైచిలుకు రకాల మొక్కలు మరియు అరుదైన మొక్కలను ఉంటాయండి. ఆ తర్వాత #కార్తీకవనం అండి ఇక్కడ ముఖ్యంగా కార్తీక మాసంలో వనభోజనాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారండి. ఇక్కడ మనకి రావి, వేప, ఉసిరి, మర్రి ఇంకా బిల్వ మొక్కలు ఎక్కవగా కనిపిస్తాయి... దీని తర్వాత వచ్చేది ున్జ్ విహార స్థలం అండి ఇక్కడ పులులు, అడవి దున్నలు, జింకలు, నెమళ్ళు, అడవి కోళ్లు, ఎలుగు బంట్లు చూడొచ్చండి మనం...ఇప్పుడు పులులు మాత్రం అరుదుగా కనిపిస్తాయి. అడవి పక్షులు, సీతాకోక చిలుకలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి... ఆ తర్వాత #క్రొకడైల్_స్పాట్ అండి ఇక్కడేనండి పాములేరు వాగు ఉండేది ... ఇక్కడ పాములు బాగా ఎక్కువగా ఉంటాయండి అందుకే స్నానాలు చేయటం నిషేధించేశారు ఇక్కడ ... ఇంకా కూసంత ఎదరికి వెళ్తే టైగర్ స్పాట్ వస్తాదండి ఇక్కడ పులుల గాండ్రింపులు వినపడతాయి. కాని ఇప్పుడు అంతగా లేవండి పులులు ఆ గాండ్రింపులు కూడా
ఇంక #జంగల్_స్టార్ క్యాంప్ సైట్ అండి ఈ ప్రదేశానికి రామాయణానికి సంబంధం ఉందంటండి ... ఇక్కడ రామాయణ కాలంలో యుద్ధం జరిగినట్లు చెప్తారండి మనకి. ఇక్కడ వలమూరు నది నీటి ప్రవాహాలు, గడ్డి మైదానాలు, కొండలు , అడవులు ఇలా చెప్పాలంటే తూర్పు కనుమల అందాలన్నీ ఇక్కడే ఉన్నాయా ?? అన్నట్టు అనిపిస్తాదండి మనకి.
ఇదంతా ఒక్కరోజులో అయిపోయేది కాదండి కాని కుదరకపోతే పర్లేదు ... కుదిరితే మాత్రం నైట్ స్టే చేయడానికి ఇక్కడ వనవిహారి రిసార్ట్ ... జంగల్ స్టార్ రిశార్ట్ లు ఉన్నాయండి లేడీస్ తో వచ్చే వాళ్ళు కుంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదండి అంటే అటవీ ప్రాంతం కదా ఎప్పుడు ఎలా ఉంటాదో చెప్పలేమండి అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండి మరి.
ఇకపోతే #బేంబో_చికెన్ అండి ఇంతదూరం వచ్చి ఇక్కడ అందాలు అన్ని చూసి ఈ బేంబో చికెన్ తినకపోతే మాత్రం వేస్ట్ అనే చెప్పాలండి ఎందుకంటే దాని లోటు తీర్చలేనిది ... ఎదురు గెడ బొంగులో చికెన్ వేసి మంటలో కాలుస్తారండి అబబ్భ భలే ఉంటాదండి ఇక్కడ తిన్న టెస్ట్ ఏ స్టార్ హోటళ్ళలో కూడా రాదండి. ఆయిల్ వాడకుండా తయారు చేస్తారేమో అందుకే ఇట్టే నచ్చేస్తాదండి
సరదాగా టూర్ వేద్దాం అనుకునే వాళ్ళు ది బెస్ట్ ప్లేస్ అయితే ముందు ఇదేనండి మన గోదారి జిల్లాల్లో ... ఒక అందమైన మధురానుభూతిని మిగులుస్తాదండి మరేడుమిల్లి టూర్ అందులో ఫ్రెండ్స్ తో అయితే మరీ బాగుంటాది అలా అని ఫ్యామిలి తో ఏళ్లకూడదా అనకండి అదైన సూపర్ అండి
(సేకరణ)