08/03/2022
అన్నల ఇలాఖాలో.. మహిళా దినోత్సవం
గండికామారం గ్రామం. అప్పట్లో అన్నల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతం గా చెలామణి అయిన మారుమూల పల్లె. అప్పుడు కరీం నగర్ జిల్లాలో ఉండేది. ఇప్పుడు బహుశా భూపాలపల్లి జిల్లాలో ఉండే అవకాశముంది.
ఆ ప్రాంతమంతా అప్పటి పీపుల్స్ వార్ ప్రాబల్యమే కనిపించేది. చిన్న చిన్న పల్లెల సమాహారం. అంతా శ్రామిక మహిళల తో, శ్రమ జీవులతో నిండిన ప్రాంతం. అటవీ గ్రామాలు కావడంతో ఎక్కువగా పోడు వ్యవసాయం చేసుకోవడానికి సుదూర ప్రాంతాలనుంచి వలస వచ్చిన కార్మికులు, అదే ప్రాంతానికి చెందిన గిరిజన ఆదివాసీలతో ఊళ్లన్నీ ఆకుపచ్చని ఆనందానికి నెలవులుగా కనిపిస్తాయి.
నా వరకైతే కార్మిక హక్కుల కోసం నిర్వహించే మే డే కార్యక్రమాన్ని, మహిళా హక్కుల కోసం నిర్దేశించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అడవి అన్నలు నిర్వహించిన కార్యక్రమాలు వార్తలకు ఉపకరించే రీతిలో భిన్నం గా ఉంటాయని ఒక భావన.
నేనప్పుడు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఉన్నాను. అప్పుడు ఔట్ లుక్ పత్రికకు స్పెషల్ కరెస్పాండెంట్ గా ఉన్న రాధికా అయ్యర్ , ఈనాడుకు వార్తలు రాసే మిత్రుడు వంగల జగన్ , నేను ముగ్గురమూ గండికామారం గ్రామం లో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని శ్రామిక మహిళల సాక్షిగా, సాయుధ మహిళా గెరిల్లాల సాక్షిగా సేకరించాం.
మిగతా వార్తలకు దీనికి తేడా ఏంటి అనిపించొచ్చుగానీ మారుమూల పల్లెల్లో సైతం మహిళా దినోత్సవం, మహిళల హక్కుల గురించి వాళ్ళలో స్ఫూర్తి కలిగేందుకు ప్రేరణ మాత్రం అక్కడి మహిళలకు ఆ సందర్భం లో వెన్నంటి ఉన్న సాయుధ మహిళా గెరిల్లాలే అని మాతో వార్తా సేకరణకు వచ్చి తర్వాత ఐ పీ ఎస్ గా వెళ్ళిపోయిన రాధికా అయ్యర్ భావన.
ఎందుకో మార్చ్ 8 సందర్భంగా చెప్పాలనిపించింది.